
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ఆచార్య థియేటర్లలోకి వచ్చేసింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామని ఉవ్విళ్లూరుతున్న మెగా అభిమానుల కల ఎట్టకేలకు నెరవేరింది. ఈ మూవీలో రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించడంతో ఆచార్య సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చెర్రీ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలలో నటించడం విశేషం అనే చెప్పాలి. ఆచార్య సినిమాను ప్రారంభించినప్పుడు సిద్ధ అనే పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అయితే ఎప్పుడైతే రామ్‌చరణ్ ఎంట్రీ ఇచ్చాడో సిద్ధ పాత్ర పరిధిని పెంచేశారు. మరోవైపు ఈ మూవీ విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ప్రముఖులందరూ ఈ మూవీని చూసి రెస్పాన్స్ ఇస్తున్నారు. కొంతమంది ఈ సినిమాపై తమ అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా ఆచార్య సినిమాను చూసి తన స్పందనను తెలియజేశారు. ఆచార్య సినిమా అద్భుతంగా ఉందని ఆయన కామెంట్ చేశారు. ఈ వయసులో కూడా తన మిత్రుడు చిరంజీవి అదరగొట్టేశాడని సన్నిహితుల దగ్గర ప్రస్తావించారు. సాధారణంగా మెగాస్టార్ సినిమా విడుదలైన ప్రతిసారి బాలయ్య ఆ మూవీని చూసి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. అందులో భాగంగానే బాలయ్య ఆచార్య సినిమాను వీక్షించినట్లు తెలుస్తోంది. చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన సినిమా కావడంతో ఆచార్య సినిమా చూసి చాలా బాగుందని బాలయ్య ప్రశంసించినట్లు టాక్ నడుస్తోంది. తన మిత్రుడు చిరంజీవి ఈ ఏజ్ కూడా కుమారుడితో పోటీపడి నటించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు, పాటలు, ఫైటింగ్స్ తనకు నచ్చాయని తెలిపారు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని.. నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు బాలయ్య వ్యాఖ్యానించారు.
కాగా బాలయ్య ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. బోయపాటి శీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ కూడా తన ఖాతాలో వేసుకున్నారు. గతంలో సింహా, లెజెండ్ సినిమాలతో బోయపాటి-బాలయ్య కాంబోకు మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే కరోనా కారణంగా అఖండ సినిమా ఎలా ఆడుతుందో అనే టెన్షన్ సినీ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో అఖండ సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల వర్షం కురిపించింది. నిర్మాతకు ఊహించని విధంగా లాభాలను అందించింది. అయితే చిరంజీవి ఆచార్య మూవీ విడుదల తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా స్టోరీని బాలకృష్ణ నటించిన అఖండ మూవీతో చాలా మంది పోల్చి చూస్తున్నారు. ఇద్దరూ సీనియర్ అగ్రహీరోలు రావడంతో ఈ పోలిక సాధారణమే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సినిమాల స్టోరీ లైన్ ఒకటే అంటున్నారు. ఈ రెండు సినిమాలు హిందూ ధర్మం ఆధారంగా తెరకెక్కించారని చెబుతున్నారు. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా మైనింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కించారు. బాలయ్య అఖండ మూవీలో మైనింగ్ మాఫియాను ఓ అఘోరా ఎలా ఎదురించారు. ఈ సందర్భంగా హిందూ ధర్మంలో ధర్మో రక్షితి రక్షిత: నేపథ్యంలో తెరకెక్కించారు. అధర్మం పెరిగిపోయినప్పుడు దేవుడు ఆదేశంతో దాన్ని చక్కదిద్దడానికి దిగివస్తాడనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. అటు ఆచార్య సినిమా కూడా మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తే.. ఆచార్య సినిమాలో మాత్రం చిరంజీవి కామ్రేడ్ పాత్రలో నటించారు.