
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో రాజమౌళి తర్వాత వరుస హిట్లు ఇచ్చిన డైరెక్టర్ ఎవరంటే అందరూ కొరటాల శివ పేరే చెప్తారు. మిర్చి సినిమాతో మెగా ఫోన్ పట్టిన కొరటాల శివ ఆ తర్వాత వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్నాడు. ఈ నాలుగు సినిమాలు ఒకదానిని మించి మరొకటి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించాయి. అయితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఆచార్య సినిమా కొంచెం నిరాశపరిచింది. ఈ సినిమాను మినహాయిస్తే కొరటాల శివ కెరీర్‌లో ఎలాంటి మచ్చ లేదు. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా ఓ సందేశం కూడా దాగి ఉంటుంది. మిర్చి సినిమాలో ఫ్యాక్షనిజంపై, శ్రీమంతుడు సినిమాలో సొంతూరి బాగోగులపై, జనతా గ్యారేజ్ సినిమాలో ప్రకృతిపై, భరత్ అనే నేను సినిమాలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం వంటి సందేశాల గురించి దర్శకుడు కొరటాల శివ ప్రేక్షకులకు చాటి చెప్పారు.
మిర్చి నుంచి ఆచార్య వరకు కొరటాల శివ ఇదే పంథాను వ్యవహరించారు. అయితే త్వరలో జూనియర్ ఎన్టీఆర్‌తో కొరటాల శివ తీయబోయే సినిమాలో ఎలాంటి సందేశం ఉండదని.. ఇది ఫక్తు కమర్షియల్ సినిమాగా తెరకెక్కించబోతున్నాడని ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఆచార్య సినిమా ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ తన 30వ సినిమా బాధ్యతలను కొరటాల శివకు అప్పగించాడు. కొరటాల శివ కూడా ఎన్టీఆర్‌తో హిట్టు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా సక్సెస్ ఇచ్చి దర్శకుడిగా బ్యాక్ బౌన్స్ అవ్వాలని చూస్తున్నారు. ఒక రకంగా కొరటాల శివకు ఇపుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఓ ఆయుధంలా దొరికాడు. మరి ఈ ఆయుధాన్ని కొరటాల శివ ఎలా ఉపయోగించి ప్రేక్షకులను మెప్పిస్తాడనేది చూడాలి. ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేయగా అందులో ఎన్టీఆర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సినిమాపై మరింత అంచనాలను పెంచింది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులలో హీరో ఎలివేషన్ మీద, సినిమాలో కంటెంట్ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
అయితే ఎన్టీఆర్ సినిమా తర్వాత మరో మూడు సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి పూర్తిగా ప్రొడ్యూసర్‌గా ఆయన కొనసాగనున్నారట. నిర్మాతగా ఓ అగ్ర నిర్మాణ సంస్థతో చేతులు కలిపి కొరటాల శివ సినిమాలను నిర్మిస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న సినిమా నిర్మాణంలో కొరటాల శివ కూడా భాగస్వామ్యం వహిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితం అవుతోంది. మరోవైపు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌కు కూడా ఈ సినిమాలో భాగం ఉంది. ఆచార్య సినిమా సమయంలోనే తాను నిర్మాతగా మారి చిన్న సినిమాలు చేయాలని ఉందంటూ కొరటాల శివ తన మనసులోని మాటను బయటపెట్టాడు. దర్శకుడిగా ఓ 10 సినిమాలు తీసి రిటైర్ అవుతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎప్పుడో తాను 10 కథలు రాసి పెట్టుకున్నానని.. వాటిని పూర్తి చేసి నిర్మాతగా మారిపోతానని పేర్కొన్నాడు. అయితే టాలెంట్ ఉన్న దర్శకుడు సినిమాలు చేయకుండా ఉండటం విచిత్రంగానే ఉంటుంది. దానికి మన హీరోలు, నిర్మాతలు ఒప్పుకుంటారో లేదో వేచి చూడాలి.