
ఒక్క విజయం కెరీర్‌ను ఉవ్వెత్తుకు తీసుకువెళ్తే.. ఒక్క పరాజయం పాతాళానికి పడేస్తుంది. దీనికి ఉదాహరణ కొరటాల శివ కెరీర్. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన అతడిని ఆచార్య అనే సినిమా పాతాళానికి పడేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమాతో కొరటాల శివ తన కెరీర్‌లో మర్చిపోలేని డిజాస్టర్‌ను అందుకున్నాడు. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తొలిసారిగా నటించిన ఫుల్ లెంగ్త్ సినిమా అయినప్పటికీ ఈ మూవీ మెగా అభిమానులను అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు చవిచూశారు. దీంతో ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తన వంతు సహాయాన్ని అందించాలని దర్శకుడు కొరటాల శివ నిర్ణయించుకున్నాడు.
ఆచార్య సినిమా రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దర్శకుడు కొరటాల శివ ముఖ్య పాత్ర పోషించాడు. తానే ఈ మూవీని భుజాన వేసుకున్నాడు. అయితే అనుకోని రీతిలో సినిమాకు భారీ నష్టాలు రావడంతో నిర్మాత రామ్‌చరణ్, కొరటాల శివ బయ్యర్లకు సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. నష్టనివారణ చర్యల్లో భాగంగా రూ.25 కోట్ల దాకా తిరిగి డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి ఇచ్చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. దీని కోసం కొరటాల శివ తన ఇంటిని కూడా తాకట్టు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును డిస్ట్రిబ్యూటర్లకు వెనక్కి ఇచ్చాడని పలువురు చెప్తున్నారు. సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల ఒక డైరెక్టర్ ఇంత పెద్ద మొత్తాన్ని వెనక్కి తిరిగి చేయటం టాలీవుడ్‌లో ఇదే మొట్టమొదటిసారి అని పలువురు చర్చించుకుంటున్నారు. అటు మెగాస్టార్ కూడా తనవంతు సహాయంగా రూ.10 కోట్లను తిరిగి ఇచ్చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆచార్య మూవీని అమెజాన్ ప్రైమ్‌కు అమ్మినా ఆ డబ్బులు కూడా సరిపోలేదని సమాచారం అందుతోంది. ఈ మూవీ థియేటర్లలోనే కాకుండా ఓటీటీలలోనూ నిరాశపరిచింది.
ప్రస్తుతం ఆచార్య మూవీ తర్వాత అటు చిరంజీవి, ఇటు కొరటాల శివ తమ తదుపరి సినిమాలతో బిజీ అయ్యారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన కూడా నిర్మాతగా భాగస్వామ్యం తీసుకున్నాడు. అటు నిర్మాతగా చిన్న సినిమాలు నిర్మించాలని ఫిక్స్ అయ్యాడు. దర్శకుడిగా 10 సినిమాలు తీసి రిటైర్ అవుతానని ఒకానొక సమయంలో స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఎప్పుడో తాను 10 కథలు రాసి పెట్టుకున్నానని.. వాటిని పూర్తి చేసి నిర్మాతగా మారిపోతానని గతంలోనే స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో నిర్మాతగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. 2013లో మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ.. ఈ సినిమా కంటే ముందు బృందావనం, మున్నా, భద్ర లాంటి సినిమాలకు రచయితగా పని చేశాడు. బాలయ్య నటించిన సింహా సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. దాంతో పాటు మరిన్ని సినిమాలకు కూడా కథలు అందించాడు. కానీ ఆయా చిత్రాల్లో కొరటాల పేరు మాత్రం పడలేదు.