
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న హాలీవుడ్ మూవీ అవతార్ 2 శుక్రవారం భారీ స్థాయిలో విడుదలైంది. ఎలాంటి ప్రచార కార్యక్రమాలు లేకపోయినా అవతార్ సినిమా సృష్టించిన ప్రభంజనం సీక్వెల్‌పై ఆసక్తిని రేపింది. జేమ్స్ కామరూన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ మూవీ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా160 భాషలలో విడుదలైంది. ఒక్క ఇండియాలోనే ఆరు భాషలలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్‌తోనే ఈ మూవీ రికార్డులు సృష్టించింది. ఈ సినిమా సుమారు 4500 పైగా థియేటర్లలో రిలీజ్ చేయడం జరిగింది. దేశంలోనే సూపర్ స్టార్ సినిమాకు ఉండే రెస్పాన్స్ కంటే ఎక్కువగా అభిమానులు తమ ఆసక్తిని అవతార్ 2 సినిమాపై చూపించారు. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు. ఈ మధ్య కాలంలో ఇంత రన్‌టైం ఉన్న సినిమా మరొకటి రాలేదు.
ఈ సినిమా కథ పండోరా గ్రహంలో జరుగుతుంది. పండోరా గ్రహం చంద్రుడి పరిమాణంలో ఉంటుంది. 2154 సంవత్సరంలో అమెరికా సైన్యం పండోరా గ్రహంపై అడుగుపెడుతుంది. అక్కడ లభించే అమూల్యమైన సహజ వనరులను లూటీ చేయడానికి అమెరికా సైన్యం వాళ్లు ప్లాన్ చేస్తారు. ఆ గ్రహంపై ఉండే మానవ ఆకారాన్ని పోలిన ఏలియన్ జనాభాను నేవీ అంటారు. నేవీ గ్రహానికి సంబంధించిన వారెవరైనా సరే వారిని దారుణంగా మట్టుపెడుతారు. అలాంటి వారిని ఎదుర్కొనడానికి నేవీ జనాభా డీఎన్ఏతో మానవ డీఎన్ఏ జోడించి సైనికులను రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే అవతార్ అనే ఆకారాన్ని సృష్టిస్తారు. అమెరికా సైన్యం నేవీలపై యుద్ధానికి పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో హీరో జేక్, అతని ఫ్యామిలీని మట్టుకరిపించేందుకు ముప్పు ముంచుకొస్తుంది. ఆ ముప్పు జేక్ సల్లీ టీం తమ కుటుంబాన్ని, భూగోళాన్ని నాశనం చేయకుండా ఎలా అడ్డుకున్నారన్నది అవతార్ 2లో దర్శకుడు చూపించాడు. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా అవతార్ సినిమాలో హైలెట్‌గా నిలిచిన విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలోనూ అద్భుతంగా ఉన్నాయి. పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, ప్రకృతి అందాలు, సాహసాలతో సినిమా అద్భుతంగా ఉంది. త్రీడీలో ఈ విజువల్స్ మరింత అందంగా కనిపించనున్నాయి. 2డీ, 3డీ, ఐమాక్స్ ఫార్మాట్‌తో పాటు 4డీఎక్స్‌లో కూడా ఈ సినిమా విడుదలైంది. తెలుగు వెర్షన్‌కు హీరో కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ డైలాగులను అందించాడు. మరోవైపు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాను చూసి రివ్యూ ఇచ్చాడు. ఈ మూవీ చూసి తాను మంత్ర ముగ్దుడినైపోయినట్లు.. జేమ్స్ కామరూన్ మేధోసంపత్తి ముందు తలవంచుతున్నట్లు అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు. 13 ఏళ్ల క్రితమే అప్పట్లో డాలర్ రేటు 50 ఉన్నప్పుడే అవతార్ సినిమాకు 2 కోట్ల బిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ వచ్చేంతవరకు కూడా ఈ సినిమా రికార్డులను చెరిపేసే హాలీవుడ్ సినిమాయే రాలేదు. ప్రపంచాన్ని ఊపేసిన అంత గొప్ప సినిమాకు సీక్వెల్ తీయడానికి దర్శకుడు జేమ్స్ కామరూన్ ఏకంగా 12 ఏళ్ల సమయం తీసుకున్నాడు. కాగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ముఖ్య పట్టణాల్లో ప్రీమియర్లు ప్రదర్శించారు. దీంతో రివ్యూ త్వరగా వచ్చేసింది.