
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవల్లో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత బన్నీకి అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. బాలీవుడ్‌లోనూ ఫాలోయింగ్ వచ్చింది. అయితే ఉన్నట్టుండి అల్లు అర్జున్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అల్లు అర్జున్ నటించిన ఓ కమర్షియల్ యాడ్‌పై కేసు నమోదు కావడం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. శ్రీ చైతన్య విద్యాసంస్థల కోసం అల్లు అర్జున్ ఓ వ్యాపార ప్రకటనలో నటించాడు. అయితే ఈ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ఉపేందర్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ యాడ్‌లో ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకులపై తప్పుడు సమాచారం చూపించారని.. ఈ ప్రకటన రూపొందించిన శ్రీచైతన్య యాజమాన్యంతో పాటు యాడ్‌లో నటించిన అల్లు అర్జున్‌పైనా చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ యాడ్ వల్ల బన్నీ చిక్కుల్లో పడే ప్రమాదముందని పలువురు సూచిస్తున్నారు. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. దీంతో బన్నీ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇటీవల విద్యాసంస్థలు ర్యాంకులపై ఇచ్చే ప్రకటనలు విద్యార్థుల్లో గందరగోళాన్ని రేకెత్తిస్తున్నాయి. ర్యాంకులన్నీ మావే అంటూ వచ్చే ప్రకటనలు చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ర్యాంకులపై మీమ్స్ కూడా నడుస్తున్నాయి. అందుకే ఇలాంటి ప్రకటనల్లో నటించేటప్పుడు బ్రాండ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుని నటించాలి. కానీ ఇటీవల బన్నీ నటించిన యాడ్స్ అన్నీ వివాదాస్పదం అవుతున్నాయి. గతంలో ర్యాపిడో యాడ్ కూడా బన్నీని కష్టాల్లోకి నెట్టింది. అల్లు అర్జున్ చేసిన రాపిడో యాడ్‌లో సిటీ బస్సుల గురించి చూపించడంపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్పట్లో ఫైర్ అయ్యారు. ఇది వెంటనే తొలగించక పోతే బన్నీపై, రాపిడో సంస్థపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంతేకాకుండా అంతకుముందు అల్లు అర్జున్ చేసిన జొమాటో యాడ్ కూడా వివాదానికి దారి తీసింది. ఇలా బన్నీ చేసిన పలు యాడ్ షూట్స్ కాంట్రవర్సీ అవుతుండటం ఆయన అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. అల్లు అర్జున్‌కు ప్రకటనలు పెద్దగా కలసిరావడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు తాజాగా అడ్డదిడ్డంగా ప్రకటనల్లో నటించే హీరోలకు ముక్కుతాడు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది. ముఖ్యంగా సరోగసీ యాడ్స్‌తో పాటు బాడీ రిఫ్రెషనర్, పాన్ మసాలా వక్కపొడి అంటూ ప్రకటనల్లో చూపించడం వంటివి బీరు కంపెనీలకు సంబంధించి మంచి నీళ్లు అని చెప్పించడం ఇకపై కుదరదు. ముఖ్యంగా విద్యా సంస్థలకు సంబంధించిన యాడ్స్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ గైడ్ లైన్స్ సూచిస్తోంది. ఇలాంటి ప్రకటనలు చేసే విషయంలో ఆయా హీరోలు ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని మరి చేయాలి. లేకపోతే లీగల్‌గా చిక్కులు తప్పవు. కాగా ప్రస్తుతం బన్నీ పుష్ప-2 సినిమాలో నటించేందుకు సన్నద్ధం అవుతున్నాడు. ఈ సినిమా మరికొన్ని నెలల్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.