
మహేష్‌బాబు చాలా సాఫ్ట్‌గా ఉంటాడు. ఎవరి జోలికి వెళ్లడు. తన జోలికి ఎవ్వరినీ రానివ్వడు. సోషల్ మీడియాలో కూడా చాలా రేర్‌గా కనిపిస్తుంటాడు. సినిమాల ప్రమోషన్‌లకు తప్పించి పెద్దగా అతడి నుంచి పోస్టులు తక్కువ. అలాంటి మహేష్‌బాబు చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన సన్నివేశం చూస్తే ఎవరికైనా కళ్లలో నుంచి నీళ్లు రావడం ఖాయం. బుధవారం నాడు మహేష్ తల్లి ఇందిరాదేవి చనిపోయారు. ఆమె అనారోగ్య సమస్యలతో గత మూడు రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమెకు 70 ఏళ్లు ఉంటాయి. సూపర్ స్టార్ కృష్ణకు మొదటి భార్య. అయితే మొదటి భార్య ఉండగానే ఆయన విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు. అయినా పిల్లలందరూ ఇందిరా దేవి దగ్గరే పెరిగారు. మహేష్ పిల్లలు కూడా తన అమ్మ దగ్గరే ఎక్కువగా పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే మహేష్‌కు తన అమ్మ అంటే ఎంతో ఇష్టం. అయితే ఆమె ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో తల్లి పార్ధివ దేహాన్ని చూస్తూ మహేష్ వెక్కి వెక్కి ఏడ్చాడు.
మహేష్ అలా ఏడుస్తుంటే ఆమె తల్లి పార్ధివదేహాన్ని చూసేందుకు వచ్చినవాళ్లు చలించిపోయారు. దీంతో అతడిని సముదాయించేందుకు ప్రయత్నించారు. ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం పద్మాలయా స్టూడియోస్‌లో ఉంచారు. మధ్యాహ్నం వరకు ఆమె పార్థివదేహం అక్కడే ఉంది. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించారు. కాగా ఇందిరాదేవి మరణం పట్ల పలువురు టాలీవుడ్ హీరోలు స్పందించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలు ఇందిరాదేవి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆమె మరణం బాధాకరమని.. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారని బాలయ్య పేర్కొన్నారు. ఇందిరాదేవి తుదిశ్వాస విడిచారనే విషయం విచారం కలిగించిందని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని.. మహేష్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇందిరా దేవి పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం మహేష్‌బాబును సముదాయించారు.
సాధారణంగా ఏ భార్య అయినా తను బ్రతికి ఉన్న సమయంలో భర్త మరో పెళ్లి చేసుకుంటే అస్సలు సహించరు. అయితే కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకున్నా ఇందిరా దేవి మాత్రం కృష్ణ రెండో పెళ్లిని గౌరవించారు. విజయనిర్మలను ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ కృష్ణ పెళ్లి చేసుకున్నానని ఇందిరా దేవికి చెప్పగా రెండో పెళ్లి జరిగినా తాను భార్యగానే కొనసాగుతానని భర్తకు చెప్పారు. కృష్ణ నిర్ణయం ఆమెను బాధ పెట్టినా తన భర్తను హర్ట్ చేయడం ఇష్టం లేక ఆమె ఈ విధంగా వ్యవహరించారు. కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు ఐదుగురు సంతానం. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా మరో ఇద్దరు మగపిల్లలు. కృష్ణ రెండో పెళ్లి అనంతరం ఇందిరా దేవి మీడియాకు దూరంగా ఉన్నారు. బంధువుల ఫంక్షన్లలో మాత్రం పాల్గొనడానికి ఆమె ఆసక్తి చూపేవారు. కుటుంబానికి, పిల్లలకు ఆమె ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తూనే పిల్లలు పెద్దలను గౌరవించేలా కెరీర్ పరంగా ఎదిగేలా ఇందిరా దేవి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే మహేష్ ఎంతో వినమ్రంగా ఉంటాడు. ఇప్పటికే రెండో భార్యను పోగొట్టుకున్న కృష్ణ ఇప్పుడు మొదటి భార్యను పోగొట్టుకోవడంతో ఆయన్ను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.