
సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 70 సంవత్సరాలు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఆమె బాధపడుతున్నారు. దీంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇందిరా దేవి మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అటు మహేష్ పిల్లలు గౌతమ్, సితార కూడా నాయనమ్మ మృతితో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వాళ్లు బాల్యంలో ఎక్కువగా నాయనమ్మ దగ్గరే పెరిగారు. దీంతో ఇందిరా దేవితో వాళ్లకు మంచి అటాచ్ మెంట్ ఉంది. ఇప్పుడు ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో సితార నాయనమ్మ పార్ధివదేహాన్ని చూసి బోరున ఏడ్చేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీటిపర్యంతమైంది. తన ఒడిలో కూర్చుబెట్టుకుని ఆమె కళ్లు తుడుస్తూ మహేష్‌బాబు ఓదార్చడం మీడియా కంట పడింది. ఈ వీడియోను చూసి మహేష్ అభిమానులు కూడా కంట నీరు పెట్టుకుంటున్నారు. తన తల్లి ఇందిరా దేవి మరణంతో మహేష్ కొంతకాలం సినిమా షూటింగులకు బ్రేక్ ఇవ్వనున్నాడు.
మాములుగా మహేష్ కూతురు సితార చాలా చలాకీగా కనిపిస్తుంది. ఆమె దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తెతో కలిసి యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు కూడా చేసి సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. ఇటీవల జీతెలుగు లాంచ్ చేసి డ్యాన్స్ షోకు మహేష్‌తో కలిసి హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందుకే సితారకు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. చిన్నవయసులోనే సితార ఘట్టమనేని ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల కొద్ది ఫాలోవర్లను సంపాదించుకుంది. సితారకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈరోజు ఇందిరా దేవి భౌతిక కాయాన్ని చూసిన సితార తల్లి నమ్రతను గట్టిగా పట్టుకొని నాయనమ్మను చూసి కంటతడి పెట్టుకుంది. అలాంటి సితార కన్నీరు పెట్టుకోవడం చూసి అభిమానులు కూడా ఎమోషనల్ అయిపోయారు. సితార ఏడుపు చూసిన అభిమానులు ఆమెకు నానమ్మతో అటాచ్ మెంట్ ఎక్కువగా ఉందేమో అని చర్చించుకుంటున్నారు. మహేష్ కుటుంబానికి దేవుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు.
అటు తన ప్రతి సినిమా విడుదలకు ముందు మహేష్ బాబు తల్లి చేతి కాఫీ తాగడంతో పాటు తల్లి ఆశీర్వాదాలు తీసుకునేవాడు. ఇలా చేయడాన్ని మహేష్ బాబు సెంటిమెంట్‌గా భావించేవాడు. తనకు అమ్మ అంటే ఎంతో ఇష్టమైన ఎన్నో ఈవెంట్లలో చెప్పేవాడు. అమ్మ చేతి కాఫీ తనకు గుడిలో దేవుడి ప్రసాదంలా ఉంటుందని మహేష్ బాబు గొప్పగా చెప్పుకునేవాడు. అమ్మ ఆశీస్సులు తనకు చాలా ముఖ్యమని మహర్షి సినిమా ఈవెంట్ సమయంలో మహేష్ బాబు చెప్పగా.. ప్రస్తుతం ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తల్లి గురించి ఏం మాట్లాడినా మహేష్ చాలా ఎమోషనల్ అవుతారని.. తమ హీరో తల్లి మరణవార్త తెలిసి గుండె తరుక్కుపోతుందని కొంతమంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కృష్ణ కుటుంబంలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూ ఉండటంతో అభిమానులు మరింత ఎక్కువగా ఫీలవుతున్నారు. కొన్నాళ్ల క్రితం విజయనిర్మల మరణించగా.. ఈ ఏడాది ప్రారంభంలో సోదరుడు రమేష్‌బాబును మహేష్ పోగొట్టుకున్నాడు. వీళ్లిద్దరూ గతంలో ఎన్నో సినిమాల్లో కలసి నటించారు. అన్న నిర్మాతగా మహేష్ సినిమాల్లో కూడా నటించాడు.