
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ విరామం తర్వాత నటించిన మూవీ ఆచార్య. సైరా నరసింహారెడ్డి తర్వాత ఇప్పటివరకు మెగాస్టార్ మూవీస్ రిలీజ్ కాలేదు. అయితే ఆచార్య ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. కానీ కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 29న విడుదలయ్యేందుకు రంగం సిద్ధం అవుతున్న వేళ మెగా అభిమానులను ఓ అంశం టెన్షన్ పెట్టిస్తోంది. ఆచార్య సినిమా ఇంకా రీ రికార్డింగ్‌లోనే ఉందని తెలుస్తోంది. చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్‌లో ఓటమి ఎరుగని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించడం కూడా ఈ సినిమాకు క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చాడు. అతడు స్వరపరిచిన లాహే లాహే, నీలాంబరి పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దర్శకుడు కొరటాల శివకు నచ్చలేదని ప్రచారం జరుగుతోంది.
దీంతో దర్శకుడు ఆచార్య మూవీ బీజీఎం బాధ్యతలను మరో మ్యూజిక్ డైరెక్టర్‌కు అప్పగించారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. తీరా ఆ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ కూడా కొరటాల శివకు నచ్చలేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం మణిశర్మ కొడుకు మహతి స్వరసాగర్ ఆచార్య రీరికార్డింగ్ కోసం పని చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇప్పుడు మెగా అభిమానులను తెగ టెన్షన్ పెడుతున్నాయి. వాస్తవానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా సినిమాలకు ప్లస్ అయ్యింది. ఆయన రీ రికార్డింగ్ స్పెషలిస్ట్ అని కూడా పేరుంది. కానీ ప్రస్తుతం వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా చివరి నిమిషంలో వాయిదా పడుతుందా అనేది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ ఆఘమేఘాల మీద రీరికార్డింగ్ పూర్తి చేసి సినిమాను విడుదల చేసినా అవుట్ పుట్ సినిమా ఫలితం ప్రభావం చూపిస్తుందా అనే వాదన కూడా మరోవైపు వినిపిస్తోంది.
కాగా ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ లేదని ఇటీవల దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. గతంలో కాజల్ అగర్వాల్ నటించిన సన్నివేశాలను డిలీట్ చేసినట్లు తెలిపాడు. నక్సలైట్ భావజాలలు ఉన్న ఆచార్య క్యారెక్టర్‌కు హీరోయిన్ పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. మరోవైపు రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. గతంలో రంగస్థలంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయగా.. ఇప్పుడు చెర్రీ పక్కన పూర్తిస్థాయి పాత్ర పోషించింది. ఇటీవల పూజా నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దీంతో ఆచార్య హిట్ పూజాకు కీలకంగా మారింది. అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాతో ఆమె సక్సెస్ జర్నీ మొదలవ్వగా.. ఆ తరువాత అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల.. వైకుంఠపురములో ఇలా వరుస హిట్స్ అందుకుంది. గత నెలలో విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా ఆమెకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అలానే చాలా కాలం తరువాత తమిళంలో బీస్ట్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. నిజానికి ఆచార్య సినిమాలో పూజా హెగ్డే పాత్ర ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. కానీ ఈ మూవీతో ఆమె హిట్ కొట్టాలని చూస్తుంది. అందుకే ప్రమోషన్స్ లో కూడా అగ్రెసివ్‌గా పాల్గొంటుంది. తెలుగులో తన స్టార్ డమ్‌ను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.