
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరుకు సీనియర్ హీరో అయినా ఇప్పటికీ ఆయన క్రేజ్ యువ అగ్రహీరోలతో సమానంగా ఉంటుంది. ఆయనతో నటించాలని చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. కానీ చిరు మాత్రం ఓ హీరోతో నటించాలని తెగ ఆరాటపడుతున్నాడు. తమ కాంబినేషన్ సెట్టయ్యే కథ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు తన తమ్ముడు పవన్ కళ్యాణ్. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు పవన్‌కు ఉన్న క్రేజ్ ఎవ్వరికీ లేదు. ఇతర హీరోల మాదిరిగా పవన్ పాన్ ఇండియా సినిమా చేస్తే బాక్సాఫీస్ రికార్డుల దుమ్ము దులపడటం ఖాయం. అయితే చిరంజీవి తన కెరీర్ ముగిసే లోగా తమ్ముడితో నటించాలని ఆకాంక్షిస్తున్నారు. బహుశా తనకు అదే చివరి సినిమా అయినా ఫర్వాలేదు అంటూ సన్నిహితుల దగ్గర మాట్లాడినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఆయన తనయుడు రామ్‌చరణ్ కూడా నటించాడు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. స్టాలిన్ సినిమా తర్వాత చిరు చాలా గ్యాప్ తీసుకుని ఐదేళ్ల కిందట ఖైదీ నంబర్ 150 అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయనకు ఇది 150వ సినిమా కాబట్టి ఆ సంఖ్య ప్రతిబింబించేలా టైటిల్ పెట్టుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ అనిపించుకోవడంతో చిరు వెనక్కి చూసుకోలేదు. ఆ తర్వాత చిరంజీవి సైరా నరసింహారెడ్డి అనే సినిమా చేశాడు. ఇప్పుడు ఆచార్య 152వ సినిమా. ప్రస్తుతం ఆయన కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా వరుసపెట్టి సినిమాలకు కమిట్ అయ్యాడు. ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు శీను సినిమాలతో పాటు పలువురు యువ దర్శకుల సినిమాలకు సైన్ చేశాడు. ఈ సినిమాల తర్వాతే పవన్‌తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తాడని ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది.
కాగా ఆచార్య సినిమా కోసం మెగా అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ హిట్ కొట్టడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు. ఈ నెల 29న విడుదలవుతున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన పలు పాటలు అభిమానుల్ని ఎంతగానే ఆకట్టుకున్నాయి. అయితే ఆచార్య సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో అందాల ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా కనిపించబోతుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుందని చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. కాజల్ కొంతవరకు షూటింగ్‌లో కూడా పాల్గొంది. కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడం.. ఆమె ఈ సినిమాను పూర్తి చేయలేకపోయింది. మరోవైపు నక్సలిజం బ్రాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తికి హీరోయిన్, రొమాన్స్ ఉంటే సెట్ కాదని డైరెక్టర్ కొరటాల కూడా భావించాడు. దీంతో ఆమె పాత్రను ఈ సినిమా నుండి డిలీట్ చేసినట్లు చిత్ర దర్శకుడు కొరటాల శివ స్వయంగా వెల్లడించాడు.