
ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకు ఎంతో క్రేజ్ ఉంది. ఈ షోను మరింతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బాలయ్య టాక్ షోకు ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చాడు. ప్రభాస్ ఎపిసోడ్‌ను బాహుబలి సినిమా మాదిరిగా రెండు పార్టులుగా విభజించి ఆహా ఓటీటీ వారు స్ట్రీమింగ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తొలి ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేయగా సెకండ్ పార్టును జనవరి 6 నుంచి ప్రసారం చేస్తున్నారు. ఈ షోలో ప్రభాస్ ప్రాణస్నేహితుడు గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను బాలయ్య వారిని అడగడం జరిగింది. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించి అన్‌స్టాపబుల్ షోలో పెద్ద చర్చే జరిగింది. ముందుగా ప్రభాస్ పెళ్లి గురించి ఫోన్‌లో రామ్‌చరణ్ కొన్ని క్లూలను ఇచ్చాడు. ఈ ఏడాదే ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నట్లు చెర్రీ రివీల్ చేశాడు.
అనంతరం గోపీచంద్ వచ్చిన తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి బాలయ్య గుచ్చిగుచ్చి అడిగాడు. అయితే అనూహ్యంగా ఈ షోకు అనుష్క వీడియో కాల్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రభాస్, అనుష్క గురించి చాలా కాలంగా రూమర్లు నడుస్తున్నాయి. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని.. అయితే అనుష్కను పెళ్లి చేసుకునేందుకు కృష్ణంరాజు అంగీకరించలేదని టాక్ నడిచింది. అయితే ప్రస్తుతం కృష్ణంరాజు కాలం చేయడంతో ఇప్పుడు అనుష్కను పెళ్లాడేందుకు ప్రభాస్‌కు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని అందరూ భావిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌కు అనుష్క వీడియో కాల్ చేసిందన్న వార్త తెలుసుకుని త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్, అనుష్క కలిసి నాలుగు సినిమాల్లో నటించారు. బిల్లా, మిర్చి, బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్లో వీరి జంట అభిమానులను కనువిందు చేసింది.
అయితే అన్‌స్టాపబుల్ షోలో బాలయ్య అడిగిన ఓ ప్రశ్నకు ప్రభాస్, గోపీచంద్ నోరెళ్లబెట్టారు. 2008లో ఒక హీరోయిన్ కోసం ప్రభాస్, గోపీచంద్ కొట్టుకున్నారని.. ఆ హీరోయిన్ ఎవరు అని బాలయ్య అడిగాడు. దీంతో ప్రభాస్‌కు ఏం చెప్పాలో తోచలేదు. నేను అయితే ఎవరితో గొడవ పడలేదని.. గోపీ నువ్వు పడితే ఆ అమ్మాయి ఎవరో చెప్పేయాలని ప్రభాస్ చెప్తాడు. దీంతో బాలయ్య ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అంటాడు. కానీ గోపీచంద్ చాలాసేపు ఆలోచించి తామిద్దరం ఒక హీరోయిన్ కోసం కొట్టుకున్నది 2008లో కాదని 2004లో అని చెప్తాడు. అప్పుడు బాలయ్య అవునా.. మరి ఆ హీరోయిన్ ఎవరు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గోపీచంద్ త్రిష పేరు చెప్తాడు. అదేంటని అడిగితే వర్షం సినిమాలో తాను, ప్రభాస్ త్రిష కోసం కొట్టుకున్న సంగతిని ప్రస్తావిస్తాడు. దీంతో ఒంగోలు వాళ్ల తెలివితేటలు తన దగ్గర వాడొద్దని బాలయ్య సరదాగా అంటాడు. అంతేకాకుండా ఈ ప్రశ్నకు చిల్ అయ్యే సమాధానం చెప్పినందుకు బాలయ్య ఇద్దరినీ అభినందిస్తాడు. అయితే 2008లో అనుష్క కోసం గోపీచంద్, ప్రభాస్ కొట్టుకున్న సంగతిని బాలయ్య పరోక్షంగా ప్రస్తావించాడని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు.