
అక్కినేని నాగార్జున నటించిన సినిమాల్లో అన్నమయ్య సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకు లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా నటించిన నాగ్ తనలోని మరో కోణాన్ని అభిమానులకు చూపించాడు. మొదట్లో అన్నమయ్య సినిమాను నాగార్జున చేస్తున్నాడంటే అందరూ వింతగా చూశారు. కానీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు మాత్రం ఎంతో పట్టుదలగా ఈ భక్తిరస మూవీని నాగార్జునతోనే తీయాలని ఫిక్స్ అయ్యారు. అయితే సమస్య అంతా వెంకటేశ్వరస్వామిగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో చాలా చర్చ జరిగింది. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో భక్తుడైన నాగార్జున.. వెంకటేశ్వరస్వామి పాత్రధారిగా నటించేవారి పాదాలపై పడాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. దీంతో దేవుడి పాత్రలో మంచి క్రేజ్ ఉన్న నటుడిని తీసుకోవాలని దర్శకుడు రాఘవేంద్రరావు భావించారట.
ఈ నేపథ్యంలో వెంకటేశ్వరస్వామి పాత్ర కోసం దర్శకేంద్రుడు తొలుత సీనియర్ హీరో శోభన్‌బాబును కలిశారు. అప్పటికే శోభన్‌బాబు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఈ అవకాశాన్ని శోభన్‌బాబు తిరస్కరించారు. కానీ రాఘవేంద్రరావు బతిమిలాడటంతో కాదనలేక.. రూ.50 లక్షలు రెమ్యునరేషన్ ఇస్తే ఈ పాత్ర చేస్తానని శోభన్‌బాబు కండిషన్ పెట్టారట. అయితే ఈ రెమ్యునరేషన్ విని దర్శక నిర్మాతలకు ఫ్యూజులు ఎగిరిపోయాయట. సినిమా మొత్తం అంత బడ్జెట్ లేదు. కేవలం ఒక్క పాత్ర కోసం అంత రెమ్యునరేషన్ ఇవ్వడం వర్కవుట్ కాదని వెనక్కి తగ్గారట. అటు ఎక్కువ రెమ్యునరేషన్ అడిగితే వాళ్లు కూడా వెనక్కి వెళ్లిపోతారని శోభన్‌బాబు ఆలోచన చేశారు. చివరకు ఆయన అనుకున్నట్లే జరిగింది. ఇంత డబ్బు ముట్టచెప్పలేమని రాఘవేంద్రరావు చెప్పేశారట. అనంతరం ఈ పాత్రకు నందమూరి బాలకృష్ణను తీసుకోవాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారట.
కానీ మాస్లో మంచి క్రేజ్ ఉన్న బాలకృష్ణ వెంకటేశ్వరస్వామి పాత్రలో ఎలా కనిపిస్తాడో అని అనుమానించారట. అప్పట్లో బాలయ్య, నాగ్ సేమ్ ఏజ్ హీరోలు కాబట్టి అభిమానుల మధ్య గొడవలు వస్తాయని ఊహించారట. దీంతో బాలయ్యను కూడా వద్దనుకున్నారట. చివరకు అనేక రకాలుగా ఆలోచించి ఈ పాత్రకు సుమన్‌ను తీసుకోవాలని నిర్ణయించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు వెల్లడించారు. సుమన్ సీనియర్ యాక్టర్ కావడంతో ఎలాంటి సమస్య ఉండదని దర్శకేంద్రుడు భావించడంతో ఆయన్ను పిలిపించి ఫొటో షూట్ చేయించారు. ఆయనకు గెటప్ చక్కగా సూట్ కావడంతో చివరకు సుమన్ వెంకటేశ్వరస్వామిగా నటించి అందరినీ మెప్పించారు. 1997లో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించింది. నాగార్జున కెరీర్లో మైల్స్టోన్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయంలో పాటలు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించాయి. ముఖ్యంగా కీరవాణి సంగీతం భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. హీరోయిన్లుగా నటించిన రమ్యకృష్ణ, కస్తూరి కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ మూవీ తర్వాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వరుసగా శ్రీరామదాసు, శిరిడీ సాయి, ఓం నమోవేంకటేశాయ వంటి సినిమాలను చేయగా అవి కూడా మంచిపేరు తెచ్చిపెట్టాయి.