
ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ గాడ్ ఫాదర్. మలయాళంలో లూసీఫర్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి మోహనరాజా దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుక్సింగ్ ప్రారంభమయ్యాయి. దీంతో అభిమానులు ఈ మూవీ టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసి తమ హీరోను చూసేందుకు ఎదురుచూస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ వంటి నటులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.
అటు అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ స్వింగ్‌లో ఉండటంతో ఈ సినిమా తొలిరోజు ఎంత వసూలు చేస్తుందన్న అంచనాలను ట్రేడ్ విశ్లేషకులు లెక్కకడుతున్నారు. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం చూస్తే తొలిరోజు ఈ మూవీ రూ.30 కోట్ల వసూళ్ల వరకు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు రూ.91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ గత రెండు చిత్రాలతో పోలిస్తే ఈ బిజినెస్ తక్కువే అయినప్పటికీ సినిమా బడ్జెట్ పరంగా చూసుకుంటే ఈ బిజినెస్ ఎక్కువే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నైజాం హక్కులు రూ.22 కోట్లు పలుకగా, సీడెడ్ 13.5 కోట్లు, ఆంధ్ర ఏరియాలో మొత్తం కలిపి 35 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కర్ణాటకలో రూ.6.50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఓవర్సీస్‌లో అయితే రూ.7.5 కోట్ల వ్యాపారం జరిగిందని టాక్ నడుస్తోంది.
తెలుగుతో పాటే హిందీలోనూ గాడ్ ఫాదర్ భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమాలో సల్మాన్ నటించడం సర్‌ప్రైజ్ అని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చిరంజీవి ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వెల్లడించాడు. సినిమాల పట్ల చిరంజీవికి, తమకున్న ప్రేమ దీనికి కారణమన్నాడు. చిరంజీవితో నటించడం మంచి అనుభవం అని.. ఇందులో చాలా కొత్త పాత్ర చేసినట్లు సల్మాన్ తెలిపాడు. బాలీవుడ్ స్టార్లు, దక్షిణాది స్టార్లు కలిసి సినిమాలు చేస్తే బాక్సాఫీసు వద్ద ప్రభంజనమే అని.. రూ.3000 కోట్లు, రూ.4000 కోట్ల వసూళ్లు వచ్చిపడతాయని సల్మాన్ అభిప్రాయపడ్డాడు. అటు రామ్ చరణ్ సలహాతోనే ఈ గాడ్ ఫాదర్ సినిమా చేశానని చిరంజీవి ఇటీవల అనంతపురంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. ఈ సినిమా కోసం చెర్రీ ఎన్నో సూచనలు ఇచ్చాడని చిరు తెలిపాడు. అయితే ఈ సినిమాలో చెర్రీ రోల్ కూడా ఉంటుందని రీసెంట్‌గా సల్మాన్ ఖాన్ లీక్ చేయడంతో గాడ్ ఫాదర్ మూవీపై అంచనాలు మరిన్ని పెరిగిపోయాయి. ఈ చిత్రంలో చిరంజీవికి సోదరుడిగా సల్మాన్ ఖాన్ నటించినట్టు తెలుస్తోంది.