
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య మూవీ ఈనెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. తండ్రీ కొడుకులు ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో కనిపించనుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందో అంటూ మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్, సినిమాకు సంబంధించిన భారీ సెట్లు ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఆచార్య మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన మేర లేవని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్‌లు గీలురాయిగా మారాయి. అక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అని టాక్ వచ్చేస్తోంది.
ఆచార్య సినిమా విషయానికి వస్తే అమెరికాలో అప్పుడే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అమెరికాలో 124 లొకేషన్లలో 402 షోల కోసం టికెట్స్ బుక్ అయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ మూవీ ఇప్పటి వరకు 3 లక్షల డాలర్లు మాత్రమే రాబట్టిందని తెలుస్తోంది. ఆశించిన దాని కంటే ఇవి చాలా తక్కువ అని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. అయితే ఇటీవల పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 9లక్షల డాలర్లు వసూలు చేసింది. చిరంజీవి, రామ్‌చరణ్ మల్టీస్టారర్ ఆచార్య సినిమాకు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తే మూవీ విడుదలయ్యే సమయానికి 6 లక్షల డాలర్లు కూడా రావడం కష్టమేనని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల వరుసగా పాన్ ఇండియా సినిమాలు విడుదల కావడం.. ఆ సినిమాలకు పెద్ద ఎత్తున ప్రజలు ఖర్చు పెట్టడంతో ఆచార్య సినిమాకు ఖర్చు పెట్టేందుకు ప్రజలు వెనకాడుతున్నట్లు ట్రెండ్ చూస్తే అర్ధమవుతుందని పలువురు భావిస్తున్నారు.
కాగా ఆచార్య మూవీకి సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన హక్కులను సుమారు 12 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 13 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఆచార్య మూవీకి మొత్తం రూ.133 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. నైజాంలో రూ.38 కోట్లు, సీడెడ్‌లో రూ.20.05 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.13 కోట్లు, తూ.గో.లో రూ.9 కోట్లు, ప.గో.లో రూ.7.5 కోట్లు, గుంటూరులో రూ.9 కోట్లు, కృష్ణాలో రూ.8 కోట్లు, నెల్లూరులో రూ.4.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.14 కోట్లు, ఓవర్సీస్‌తో కలుపుకుని మొత్తం రూ.133.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా ఆచార్య ఎంత రాబడతాడో వేచి చూడాలి. ఈ మూవీలో చిరంజీవికి జోడీ లేదని ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ వెల్లడించాడు. రామ్‌చరణ్ సరసన మాత్రం పూజా హెగ్డే నటించింది. మణిశర్మ ఈ మూవీ సంగీతం సమకూర్చాడు.