
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరు అని అడిగితే అందరూ చెప్పే పేరు హీరో ప్రభాస్. 43 ఏళ్లు దాటుతున్నా ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెద్దనాన్న కృష్ణంరాజుకు కూడా ప్రభాస్ పెళ్లి చూడాలని కోరికగా ఉండేది. కానీ ఆయన తన చివరి కోరిక తీరకుండానే స్వర్గస్తులయ్యారు. తన పెద్దనాన్న ఆఖరి కోరిక తీర్చేందుకు అయినా ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని సన్నిహితులు పోరు పెడుతున్నారు. దీంతో ప్రభాస్ మనసు కరిగినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా వీలు చూసుకుని వివాహం చేసుకోవాలని ప్రభాస్ ఫిక్స్ అయినట్లు ఫిలింనగర్లో ప్రచారం జరుగుతోంది. తనతో నటిస్తున్న ఓ హీరోయిన్ ప్రేమలో ప్రభాస్ పడిపోయాడని.. ఇటీవల ఆమెకు ప్రపోజ్ చేశాడని వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ కృతిసనన్. ప్రభాస్, కృతి సనన్ మధ్య ఏదో నడుస్తోందని నేషనల్ మీడియా ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉంది.
తాజాగా ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు సోషల్ మీడియా వేదికగా షాకింగ్ కామెంట్లు చేశాడు. ఉమైర్ సంధు తన పోస్టులో అతి త్వరలో ప్రభాస్, కృతిసనన్ నిశ్చితార్థం జరగనుందని చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ మూవీ షూటింగ్ సమయంలో కృతిసనన్‌కు ప్రభాస్ తన మనస్సులోని ప్రేమను వెల్లడించాడని ఉమైర్ సంధు వివరించాడు. ప్రభాస్ ప్రేమను కృతిసనన్ యాక్సెప్ట్ చేసిందని.. ప్రస్తుతం వాళ్లిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని తెలిపాడు. మరోవైపు ఇటీవల కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలోనూ వరుణ్ ధావన్ కొన్ని హింట్లు ఇచ్చాడు. డార్లింగ్ ఆమె లైఫ్‌లోకి వచ్చాడు.. కృతి మనసులో ఉన్న వ్యక్తి ముంబైలో లేడు. ప్రస్తుతం దీపికతో కలిసి షూటింగ్ చేస్తున్నాడు అంటూ క్లూ అందించాడు. ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్‌తో కలిసి దీపికా పదుకునే నటిస్తోంది. దీంతో అతడు ప్రభాస్ అంటూ అభిమానులు ఊహల్లో మునిగిపోయారు. నిజంగా ప్రభాస్, కృతిసనన్ పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుంటుందని అతడి అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్, కృతిసనన్ ఇద్దరూ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ వరుసగా సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు మారుతి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. అటు కృతి ససన్ నటించిన బాలీవుడ్ మూవీ ఇటీవల విడుదలైంది. వరుణ్ ధావన్‌తో కలిసి ఆమె నటించిన భేడియా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ మూవీ తోడేలుగా అనువాదమైంది. అయితే కృతిని ఏడిపించేందుకు వరుణ్ ధావన్ పదేపదే పరోక్షంగా ప్రభాస్ పేరు తీస్తున్నాడా లేదా నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా అన్న విషయం తెలియడం లేదు. ప్రభాస్‌తో ప్రేమాయణం వార్తలపై కృతిసనన్ కూడా స్పందించింది. ప్రభాస్, కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్లలో ఎవరిని పెళ్లి చేసుకోవాలని ఉందని మీడియా అడగ్గా రెబల్ స్టార్ పేరు చెప్పేసింది. ఒకవేళ ఛాన్స్ వస్తే ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని కృతి చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు అనుష్క శెట్టి, ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని ప్రభాస్, అనుష్క ఇద్దరూ స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రచారం ఆగిపోయింది. మొత్తానికి కృతిసనన్‌తో ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే వీళ్ల ఎంగేజ్మెంట్ జరగనుందని సమాచారం.