
సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో వాల్తేరు వీరయ్య మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సాధించి వింటేజ్ బాస్ ఈజ్ బ్యాక్ అని చిరంజీవి నిరూపించుకున్నాడు. ప్రస్తుతం భోళా శంకర్ మూవీ షూటింగ్‌తో చిరు బిజీబిజీగా గడుపుతున్నాడు. వాల్తేరు వీరయ్య విజయోత్సవ సంబరాలను భోళా శంకర్‌లో సెట్‌లోనే జరుపుకున్నాడు. అయితే రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ రీమేక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు గత ఏడాది మలయాళం మూవీ లూసీఫర్‌కు రీమేక్‌గా గాడ్ ఫాదర్ అనే మూవీలోనూ నటించాడు. అనంతరం వాల్తేరు వీరయ్య లాంటి స్ట్రెయిట్ సినిమాతో సక్సెస్ సాధించిన తర్వాత చిరు నటిస్తున్న భోళా శంకర్ మూవీ కూడా వేదాళం అనే తమిళ సినిమాకు రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలం అయినా ఇంకా ఫైనల్ షెడ్యూల్‌కు చాలా టైమ్ పట్టేలా ఉందని తెలుస్తోంది.
సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయిన తర్వాత చిరంజీవి రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడాయన మరికొన్ని ప్రాజెక్టులను మొదలెట్టే పనిలో ఉన్నాడు. చిరు మరో రీమేక్ సినిమాలోనూ నటించబోతున్నాడని నెట్టింగ్ తెగ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ సినిమానే అజిత్ నటించిన విశ్వాసం. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చి సూపర్ హిట్ అయిన విశ్వాసం మూవీని మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు రీమేక్ బాధ్యతలను సీనియర్ డైరెక్టర్ వీవీ వినాయక్‌ను అప్పగించినట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దర్శకుడు వి.వి.వినాయక్ ఈ కథలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి, వినాయక్ కాంబినేషన్‌లో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడో సినిమా రాబోతున్నట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రానుందని అంటున్నారు.
వినాయక్, చిరు కాంబోలో వచ్చిన రెండు సినిమాలు రీమేక్ అని.. దీంతో మూడో సినిమా కూడా రీమేక్ అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన రమణ సినిమాను ఠాగూర్‌గా, కత్తి సినిమాను ఖైదీ నంబర్ 150గా వినాయక్ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా తెరకెక్కించి విజయాలు సాధించాడు. ఇప్పుడు అదే కోవలో విశ్వాసం సినిమాకు కూడా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి విశ్వాసం రీమేక్‌లో నటించడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అంతేకాకుండా తమిళంలో ఈ సినిమాను నిర్మించిన మేకర్స్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశ్వాసం మూవీని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఈ మూవీని టీవీలోనూ ప్రసారం చేశారు. అదే మూవీని రీమేక్ చేస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కొత్త కథ, సరికొత్త స్క్రీన్ ప్లే, ఊహించని ట్విస్టులున్న స్ట్రెయిట్ సినిమాలను చూడడానికే జనాలు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదని.. గాడ్ ఫాదర్ విషయంలో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. మళ్లీ అలాంటి తప్పు చేయవద్దని చిరును కోరుతున్నారు.