
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా మూవీ రి రిలీజ్‌లోనూ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. పవన్ బర్త్ డే కానుకగా ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా థియేటర్లలో పవర్‌స్టార్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కొత్త సినిమా రిలీజ్ అయితే ఏ స్థాయిలో సంబురాలు చేస్తారో ఈ రెండు సినిమాలకు కూడా అదే స్థాయిలో పవన్ అభిమానులు రచ్చ చేశారు. కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో కూడా జల్సా సినిమా రిలీజ్ అయింది. దాదాపు 700లకు పైగా స్క్రీన్‌లలో విడుదలై పోకిరి రికార్డును చెరిపివేసింది. తాజాగా లండన్‌లో జల్సా సినిమా రికార్డు సృష్టించింది. స్పెషల్ షోల ద్వారా 6 లక్షల డాలర్లు వసూలు చేసి మరే ఇతర సినిమాకు సొంతం కాని రికార్డును పవన్ సినిమా కైవసం చేసుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు.
జల్సా మూవీలో పవన్ కళ్యాణ్ సరసన మెయిన్ హీరోయిన్‌గా ఇలియానా నటించింది. అటు పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ మూవీ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. పవన్‌కల్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. కేవలం ఈ ఒక్కరోజే సుమారు 702 షోలు ప్రదర్శించారు. జల్సా సినిమా విడుదలైన ప్రతి చోట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే రూ.3.20 కోట్లు వసూలు చేసిందని, రీ రిలీజ్‌లో ఒక సినిమా ఇన్నికోట్లు సాధించడం ఇదే తొలిసారి అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. పవన్ చిత్రం సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికిందని చెబుతున్నారు. ఇటీవల మహేష్ బాబు నటించిన పోకిరి మూవీని రీ రిలీజ్ చేయగా రూ.1.73 కోట్లు వసూలు చేసింది. అప్పట్లో వెయ్యి స్క్రీన్‌లలో విడుదలైన మొదటి సినిమాగా జల్సా రికార్డు సృష్టించింది. కేవలం విజయవాడలోనే రిలీజ్ డే రోజు లక్ష మందికి పైగా సినిమాను వీక్షించిన ఘనత జాల్సా మూవీ సొంతం చేసుకుంది. ఇప్పటికి ఆ రికార్డు ఇంకా అలానే ఉంది.
స్టార్ హీరోలు నటించిన ఒకప్పటి బ్లాక్‌బస్టర్, ఫీల్‌గుడ్ చిత్రాలను ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతిక మార్పులు చేసి రీ రిలీజ్‌ల రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 4కే వెర్షన్‌లో విడుదలైన మహేష్ పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా సత్ఫలితాలు అందుకున్నాయి. చాలా రోజుల తర్వాత హౌస్‌ఫుల్ బోర్డులతో థియేటర్లు అన్నీ కళకళలాడాయి. దీంతో ఈ రీ రిలీజ్ ట్రెండ్ బాగుందని నిర్మాణ సంస్థలు, సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన బిల్లా మూవీని ఆ హీరో పుట్టినరోజున మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇక, సెప్టెంబర్ 8న ధనుష్ – శ్రుతిహాసన్ నటించిన 3 విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ఇంద్ర సినిమాను 4కె వెర్షన్‌లో విడుదల చేస్తామని, గ్రాండ్ లెవల్‌లో దీన్ని రీ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పేర్కొంది.