
నందమూరి బాలయ్యకు సింహా సెంటిమెంట్ కొనసాగుతోంది. సింహా పేరుతో ఆయన నటించిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. గతంలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, సింహా, జై సింహా వంటి సినిమాలు విజయం సాధించాయి. ఇప్పుడు ఈ సినిమాల జాబితాలో మరో సినిమా చేరింది. అదే వీరసింహారెడ్డి మూవీ. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. దీంతో అభిమానులు జై బాలయ్య అనే నినాదాలు చేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన వారసుడు మూవీ వాయిదా పడటంతో బాలయ్య సినిమాకు తొలిరోజు కావాల్సినన్నీ థియేటర్లు దొరికాయి. దీంతో తొలిరోజు వీరసింహారెడ్డి అంచనాలకు తగిన రీతిలో వసూళ్లు సాధించినట్లు బాక్సాఫీస్ రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్తో కలుపుకుని వీరసింహారెడ్డి తొలిరోజు రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం అందుతోంది.
ఈ మూవీలో బాలయ్య మరోసారి ఫుల్ లెంగ్త్ మాస్ క్యారెక్టర్లో కనిపిస్తుండటంతో నందమూరి అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీతో బాలయ్య గాడ్ ఆఫ్ మాసెస్‌తో రచ్చ రచ్చ చేస్తున్నాడు. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీని మైత్రీమూవీస్ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య, శృతి హాసన్‌తో పాటు దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిక్టేటర్, అఖండ తర్వాత సంగీత దర్శకుడు తమన్ బాలయ్య వీరసింహారెడ్డికి మరోసారి సంగీతం అందించాడు. ఈ మూవీకి తమన్ సంగీతం కూడా ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన పాటలకు అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఏదైతే కోరుకున్నారో అవన్నీ అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. దీంతో తొలిరోజు ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.
వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య వీరసింహారెడ్డిగా, బాల నరసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఆయన చెల్లెలు కమ్ మేనత్త పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించాడు. ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాలో లెజెండ్ తరహాలో బాలయ్య చెప్పిన పొలిటికల్ డైలాగులు పేలాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ ఎటాక్ చేశారు. సంతకాలు పెడితే బోర్డుపై పేరు మారుతుందేమో… ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేరు అంటూ బాలయ్య స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై ఈసినిమాలో డైలాగుల రూపంలో సెటైర్లు వేశారు. ఈ మూవీ రన్ టైమ్ రెండు గంటల 43 నిమిషాలుగా ఉంది. ఇప్పటికే సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్‌గా నిలుస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మూడు పాటలు, ఒక బిట్ సాంగ్, ఫైట్లు అన్నీ సెకండాఫ్‌లో రావడం వల్ల సెకండాఫ్ టైట్ ప్యాక్ అన్న టాక్ వినిపిస్తోంది.