
భీమ్లా నాయక్ వంటి పవర్ స్ట్రామ్ తర్వాత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ హరిహరవీరమల్లు. పవన్ తొలిసారిగా పీరియాడిక్ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మూవీతో పవన్ మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులు విశ్వసిస్తున్నారు. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీ 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపొందుతోంది. ఇది ఒక లెజండరీ బందిపోటు వీరోచిత గాథ. ఇది భారతీయ సినిమాలో ఇప్పటిదాకా చెప్పని కథ. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఎంతో పకడ్బందీగా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. మెగా సూర్యా మూవీస్ బ్యానరుపై ఏఎమ్ రత్నం ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. కానీ ఈ సినిమా బిజినెస్ ఇప్పటి నుంచే ఊపందుకుంది. హరిహరవీరమల్లు మూవీకి సంబంధించి ఓవర్సీస్ హక్కుల విషయంలో తీవ్ర పోటీ నెలకొందని తెలుస్తోంది. ఒక్క అమెరికా హక్కులను రూ.15 కోట్లకు అమ్మాలని నిర్మాత ప్రయత్నిస్తున్నారు. అయితే రూ.20 కోట్లు ఖర్చు చేసి అయినా ఈ సినిమా హక్కులను దక్కించుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్క అమెరికా నుంచే రూ.20 కోట్లు వస్తే ఆస్ట్రేలియా, యూకే వంటి మిగిలిన దేశాల నుంచి కూడా అంతేస్థాయిలో కాసుల వర్షం కురుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్‌గా ఈ సినిమా రూ.100 కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ జరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్లాన్ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. పవన్ వేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని ఫిక్సయినట్టు తెలుస్తోంది. పవన్ బల్క్ డేట్స్ కూడా కేటాయించాడని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని ఫిలింనగర్ సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది.
మొన్నటి వరకు పవన్ సముద్రఖని తెరకెక్కించే వినోదాయ సీతం రీమేక్‌ను ముందు పూర్తి చేస్తాడని భావించారు. కానీ మధ్యలో ఉన్న హరిహర వీరమల్లును పక్కకు పెట్టి రీమేక్‌కు డేట్లు ఇస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్ధేశ్యంతో ఈ సినిమాను పూర్తి చేయాలని పవన్ డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది. హరిహరవీరమల్లు చిత్రంలో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పవర్ గ్లాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా నటిస్తున్నారు. అయితే ఆయనను బంధించిన సమయంలో పవన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి పదుల సంఖ్యలో ప్రజలు ముందుకు వచ్చే సీన్ ఉంటుందట. ఈ సీన్ ఎంతో ఎమోషనల్‌గా అంతే పవర్ ఫుల్‌గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.