
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోటైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న సమంత ఆరోగ్యం ప్రస్తుతం కాస్త కుదుట పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శాకుంతలం సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమానికి సమంత హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతుండగా సమంత ఎమోషనల్ అయ్యింది. ఏకంగా కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఆరోగ్యం బాగోకపోయినా ఎలాగైనా ఈ కార్యక్రమానికి రావాలని బలం తెచ్చుకుని వచ్చానని సమంత వెల్లడించింది. గుణశేఖర్‌పై ఉన్న అభిమానం, గౌరవంతోనే వచ్చానని.. ఎందుకంటే ఆయన సినిమాను ఎంతో ప్రేమిస్తారని తెలిపింది. శాకుంతలం సినిమాను కూడా గుణశేఖర్ ప్రాణం పెట్టి తీశారని.. ఈ మూవీ ట్రైలర్ అందరికీ నచ్చుతుందని సమంత ఆశాభావం వ్యక్తం చేసింది. శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు గుణ శేఖర్ ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ప్రశసించాడు. దాంతో సమంత ఎమోషనల్‌కు గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సినిమాకు సమంతనే హీరో అని, కేవలం సమంతను నమ్మి దిల్ రాజు ఈ ప్రాజెక్టులో భాగమై, కోట్ల రూపాయలు పెట్టారని గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. అటు తాను జీవితంలో ఎన్ని బాధలు భరించినా సినిమా మీద ప్రేమను వదులుకోలేదని సమంత చెప్పింది. ప్రేక్షకుల నుంచి ఇంత ప్రేమ దొరుకుతుందని అస్సలు అనుకోలేదని.. శాకుంతలం సినిమా విడుదలైన తర్వాత తనపై ప్రేక్షకులకు మరింత ప్రేమ పెరుగుతుందని అనుకుంటున్నట్లు అభిప్రాయపడింది. సినిమాను తాను ఎంత ప్రేమిస్తానో.. సినిమా కూడా తనను అంతే ప్రేమించడం నిజంగా అద్భుతమని సమంత పేర్కొంది. సమంత చివరిసారిగా కరణ్ జోహార్ టాక్ షోలో పబ్లిక్‌గా కనిపించింది. చివరకు యశోద సినిమా సమయంలోనూ ఆమె మీడియా ముందుకు రాలేదు. ఆ సమయంలో కేవలం ఓ ఇంటర్వ్యూ ద్వారా సినిమాను ప్రమోట్ చేసింది. అంతే కానీ ఆమె బయటకి మాత్రం రాలేదు.
సుమారు 7 లేదా 8 నెలల తర్వాత సమంత మీడియా ముందుకు రావడం, అందులోనూ ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతుండటంతో అందరూ ఆమెను చూసేందుకు ఆసక్తి చూపించారు. అయితే ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంతో అభిమానులు కూడా ఆవేదనకు గురయ్యారు. అయితే సమంత ముఖంలో చాలా మార్పులు కనిపించాయి. ఆమె జపమాలతో శాకుంతలం ట్రైలర్ ఈవెంట్‌కు హాజరైంది. దీంతో ఆమె ఇంకా మాములు మనిషి కాలేదని స్పష్టమవుతోంది. తన సినిమాలకు ప్రొమోషన్ ఎలా అయినా చెయ్యాలన్న తపనతో, సమంత మళ్ళీ కొన్ని నెలల తరువాత బయటకి వచ్చింది. ఆమె వస్తోందని తెలిసి మీడియా వాళ్ళ హంగామా ఇంత అంతా కాదు. సుమారు ఒక 50 కెమెరాల ఫ్లాష్ ఒక్కసారిగా ఆమె మీద పడింది. ఇది ఆమెకు ఒక కొత్త జీవితం. చాలా గ్యాప్ తరువాత ఆలా కిక్కిరిసిన మీడియా ముందుకు వచ్చింది. అదే వేరేవాళ్లు అయితే ఒక్కసారిగా డీలా పడిపోతారేమో కానీ సమంత ఏమీ తడబడకుండా, మనసులో ఎంతో టెన్షన్‌గా ఉన్నా నవ్వుతూనే అందరినీ పలకరించింది. ఏదేమైనా ఆమె విల్ పవర్, ధైర్యం చూసి మెచ్చుకోవాలని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. సమంత త్వరగా కోలుకుని మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఆమె అభిమానులు సూచిస్తున్నారు.