
నేచురల్ స్టార్ నాని, మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా జంటగా నటించిన ‘అంటే సుందరానికీ’ చిత్రం జూన్ 10న థియేటర్లలో విడుదలైంది. మెంటల్ మదిలో, బ్రోచెవారెవరురా వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయ ఈ మూవీని తెరకెక్కించాడు. ఇటీవల వరుసగా సినిమాలను నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీస్ అంటే సుందరానికీ సినిమాను కూడా నిర్మించింది. తొలిరోజే ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. అయితే నిడివి ఎక్కువగా ఉందనే కంప్లైంట్లు వచ్చాయి. సుమారు 3 గంటల కంటే పైగా ఈ సినిమా ఉండటం మైనస్‌గా మారింది. దీంతో ఆరంభంలో అంచనాలు రేపిన సినిమాకు అందుకు తగ్గ రీతిలో మాత్రం వసూళ్లు రాలేదనే టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు రూ.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. టాక్ కూడా పాజిటివ్‌గా రావడంతో నాని కెరీర్‌లో మరో హిట్ సినిమా పడుతుందని అంచనా వేశారు.
నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఏపీలోని మిగతా ప్రాంతాల్లో రూ.10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. అలాగే, ఓవర్సీస్‌లో రూ. 3.50 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.5 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలిసింది. అయితే అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అన్న రీతిలో అంటే సుందరానికీ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచంగా రూ.16 కోట్లు మాత్రమే రాబట్టిందని ట్రేడ్ పండితులు వెల్లడించారు. ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి రావాలంటే సోమవారం నుంచి నిలకడగా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సినిమాకు ఫుల్ రన్‌లో రూ.32 కోట్లు వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఈ సినిమా విజయంలో కీలకపాత్ర వహిస్తుందని భావిస్తున్నారు. నాని, నజ్రియా నటన, కుటుంబ కథా చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. నాని నటన వేరే లెవల్లో ఉందని.. ఇలాంటి పాత్రలను నాని మాత్రమే చేస్తాడని సినిమా చూసిన వాళ్లు ప్రసంశలు కురిపిస్తున్నారు.
ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, నదియా, రోహిణి కీలక పాత్రలను పోషించారు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఈ మూవీలో నాని సహచర ఉద్యోగి పాత్రలో నటించి అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేసింది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అయితే నాని గత చిత్రం శ్యామ్ సింగరాయ్‌తో పాటు పలు చిత్రాలకు ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ వసూళ్లు నమోదయ్యాయి. శ్యామ్ సింగరాయ్‌తో పోల్చుకొంటే అంటే సుందరానికీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ చాలా తక్కువగా నమోదయ్యాయి. ప్రీమియర్ల వసూళ్లకు సంబంధించి అమెరికాలో 228 లొకేషన్ల నుంచి 212,653 డాలర్లు వసూలు చేసింది. యూకేలో 60 లోకేషన్లలో 87 షోల ద్వారా 5600 టికెట్లు అమ్ముడుపోయాయి. అదే విధంగా ఆస్ట్రేలియాలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ పరంగా 49 లోకేషన్లలో 83 షోల ద్వారా 1500 లకుపైగా టికెట్లు అమ్ముడుపోయాయి. వీకెండ్ వసూళ్లను గమనిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సోమవారం నుంచి వచ్చే వసూళ్లను బట్టి ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉందని చెప్పవచ్చు.